• Neti Charithra

ALERT... ఈ బ్యాంక్ IFSC కోడ్స్ పనిచేయవు




మీకు సిండికేట్ బ్యాంకులో అకౌంట్ ఉందా? 2021 జూలై 1 నుంచి సిండికేట్ బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ పనిచేయవని కెనెరా బ్యాంక్ స్పష్టం చేసింది. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కీలకం. సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు ప్రస్తుతం ఉన్న ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్‌ని జూన్ 30 వరకే ఉపయోగించుకోవచ్చు. జూలై 1 నుంచి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. గతేడాది ఏప్రిల్‌లో సిండికేట్ బ్యాంకు కెనెరా బ్యాంకులో విలీనం అయిన సంగతి తెలిసిందే. కాబట్టి SYNB తో ప్రారంభమయ్యే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ మారాయని, కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ జూలై 1 నుంచి అందుబాటులోకి వస్తాయని కెనెరా బ్యాంక్ ప్రకటించింది. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు జూలై 1 నుంచి CNRB తో ప్రారంభమయ్యే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ ఉపయోగించాలని తెలిపింది.


కేంద్ర ప్రభుత్వం 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా మార్చిన సంగతి తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం కాగా, కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం అయ్యాయి. ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనమైంది. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు మెగా బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. అయితే బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా పాత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ నిలిపివేసి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ అమలు చేస్తున్నాయి బ్యాంకులు. ఐఎఫ్‌ఎస్‌సీ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. 11 డిజిట్స్ ఆల్ఫాన్యూమరికల్ కోడ్ ఇది. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే డబ్బులు స్వీకరించే అకౌంట్ హోల్డర్ బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరి.