• Neti Charithra

82 మంది మాజీ ఎంపీ ల కు నీరు.. విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కేంద్రం ఆదేశం...!

#82 మంది మాజీ ఎంపీ ల కు నీరు.. విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కేంద్రం ఆదేశం!

ఢిల్లీ: నేటి చరిత్ర (సెప్టెంబర్15) కేంద్ర ప్రభుత్వం 82 మంది మాజీ ఎంపీ లకు కేటాయించిన బంగ్లా లకు విద్యుత్ సరఫరా, నీటి వసతి, గ్యాస్ సరఫరాను నిలిపి వేయాలని ఆదేశించింది. గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం మాజీ ఎంపీ లు అయిన వారికి కేటాయించిన బంగ్లాలను 82 మంది మాజీ ఎంపిలు ఇప్పటికీ ఖాళీ చేయలేదని సంబంధింత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ప్యానల్‌ హెచ్చరించినప్పటికీ ఈ మాజీ ఎంపిలు ఢిల్లీలోని లుటియన్‌లో తమ అధికారిక బంగ్లాను ఖాళీ చేయలేదని సమాచారం. వారిని త్వరగా ఖాళీచేయించేందుకు పబ్లిక్‌ ప్రెమిసెస్‌(అనధికార ఆక్రమణదారుల తొలగింపు) చట్టం కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. 200 మంది మాజీ ఎంపిలకు వారంలోగా బంగ్లాలను ఖాళీ చేయాలని, మూడు రోజుల్లో విద్యుత్‌, నీరు, గ్యాస్‌ కనెక్షన్‌ వంటి సదుపాయాలు నిలిపివేస్తామని సిఆర్‌ పాటిల్‌ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ గత నెల 19న ఆదేశించింది. ఈ ఆదేశాల అనంతరం చాలా మంది తమ బంగ్లాలను ఖాళీ చేశారని, వీరిలో 82 మంది ఇంకా ఖాళీ చేయలేదని తాజా జాబితాలో వెల్లడైనట్లు వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఆ బంగ్లాల్లోనే కొనసాగడం ఆమోదయోగ్యం కాదని, అటువంటి మాజీ ఎంపిలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ వర్గాలు తెలిపాయి. 2014లో వారికి కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయాలని మాజీ ఎంపిలకు నోటీసులు కూడా పంపనున్నట్లు తెలుస్తోంది. ' మాజీ ఎంపిలు అధికారిక బంగ్లాలను విడిచి వెళ్లకపోతే పబ్లిక్‌ ప్రెమిసెస్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఈ ఉత్తర్వులు జారీ అయితే విద్యుత్‌, నీరు, వంటగ్యాస్‌ కనెక్షన్స్‌ తొలగిస్తాం' అని పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం, లోక్‌సభ రద్దు చేసిన నెలలోపు మాజీ ఎంపిలు తమ బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.