• Neti Charithra

73 ఏళ్ళ వయసులో... ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన మంగాయమ్మ!

#73 ఏళ్ళ వయసులో... ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన మంగాయమ్మ!

.విజయవాడ: నేటి చరిత్ర (సెప్టెంబర్5)

73 ఏళ్ళ వయసులో ఓ వృద్ధురాలు ఇద్దరు కవల బిడ్డలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు బ్రేక్ చేసింది తూర్పు గోదావరి కు చెందిన మంగాయమ్మ(73).

తన కడుపు పండాలని ఎన్నో కలలు కంది. ఎందరో వైద్యులను సంప్రదించి రూ.లక్షలు వెచ్చించింది. ఎన్నేళ్లు గడిచినా ఆ కలను సజీవంగానే ఉంచి పట్టువదలకుండా కృషి చేసింది. ఎట్టకేలకు గుంటూరులోని అహల్య నర్సింగ్‌ వైద్య బృందం ముందుకు వచ్చింది. 11 మంది వైద్య బృందం తొమ్మిది నెలల పాటు నిరంతర పర్యవేక్షణతో ఇద్దరి పండంటి (కవల) ఆడపిల్లలకు గురువారం ఉదయం 10.30 గంటలకు జన్మనిచ్చి ఆ తల్లి తన కలను నెరవేర్చుకుంది. వైద్య చరిత్రలో అరుదైన ఘటనగా దీన్ని వైద్యులు పేర్కొంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కోట రామచంద్రా పురం, ద్రాక్షారామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని నేలపర్తిపాడుకు చెందిన యరమాటి సీతారామరాజు (రాజారావు), మంగాయమ్మకు 1962 మార్చి 22న వివాహమైంది. ఎన్నేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో సంతానం కోసం చెన్నరు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. దేశ విదేశాల మందులు వాడారు. అయినా ఫలితం లేకపోవడంతో ఓ ఆడపిల్లను పెంచుకుని పెళ్లి చేశారు. ఆమె తన భర్తతో విదేశాలకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కన్నబిడ్డలు కావాలనే కోరిక వారిలో మళ్లీ రేగింది. మళ్లీ వైద్యులను సంప్రదించారు. ఈ సారి మాత్రం వైద్యుల నుండి నిరుత్సాహమైన సమాధానం వచ్చింది. ఈ వయసులో గర్భం దాల్చడం అసాధ్యమని చెప్పేశారు. అయితే పొరుగున ఉన్న మహిళ 55 ఏళ్ల వయస్సులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంతో బిడ్డకు జన్మనిచ్చింది. ఇది తెలిసిన మంగాయమ్మ తనకు సంతానం కావాలని, కృత్రిమ సంతాన సాఫల్య విధానం గురించి భర్తకు తెలపటమే గాక తానూ ఆ విధానంలోనే పిల్లలను కంటానని చెప్పి ఒప్పించింది. గతేడాది 2018 నవంబరు 12న గుంటూరులోని అహల్య నర్సింగ్‌ హోమ్‌కు చేరుకున్నారు. గైనకాలజిస్ట్‌, ఐవిఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేసన్‌) నిఫుణులైన డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ను కలిసి తమ మనసులో మాట చెప్పారు. డాక్టర్‌ ఉమాశంకర్‌ మరికొంతమంది డాక్టర్లను సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించారు. మంగాయమ్మకు మోనోపాజ్‌ దశ ముగియడంతో పీరియడ్స్‌ ఆగిపోయాయి. ఐవిఎఫ్‌ పద్ధతిలో ప్రయత్నించినప్పుడు మొదటి సైకిల్‌లోనే సత్ఫలితాలివ్వడంతో ఈ ఏడాది జనవరిలో అహల్య నర్సింగ్‌ హోంలో జాయిన్‌ అయ్యారు. ఆమె తీసుకునే ఆహారం దగ్గర నుంచి మందులు వరకు ప్రతిదీ డాక్టర్ల పర్యవేక్షణలో సాగింది. మంగాయమ్మ ప్రసవించే వరకూ 11 మంది డాక్టర్ల బృందం నిరంతరం పర్యవేక్షించారు. తొమ్మిది నెలలప్పుడు మంగాయమ్మకు సీమంతం చేయాలని బంధువులు కోరారు. ఈ పరిస్థితిలో ఆమెను బయటకు పంపించడం కుదరదని చెప్పి గురువారం నాడు సిజేరియన్‌కు ముందు ఆమెకు ఘనంగా సీమంతాన్ని ఆస్పత్రిలోనే చేశారు. అనంతరం ఆపరేషన్‌ ద్వారా 10.30 గంటలకు మంగాయమ్మ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon