• Neti Charithra

27 కు చేరిన పడవ మునక మృతులు.. గల్లంతు అయిన. వారికోసం కొనసాగుతున్న ... గాలింపు!

#27 కు చేరిన పడవ మునక మృతులు.. గల్లంతు అయిన. వారికోసం కొనసాగుతున్న ... గాలింపు!

రాజమండ్రి: నేటి చరిత్ర (సెప్టెంబర్17) తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో బోటు బోల్తా ఘటనలో గల్లంతైన వారిలో మరో 19 మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. వాటిలో దేవీపట్నం వద్ద పది, పోలవరం వద్ద మూడు, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండు, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద రెండు, యానాం వద్ద ఒకటి, పట్టిసీమ వద్ద ఒకటి వున్నాయి. మృతుల్లో మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది, తెలంగాణకు చెందిన ఎనిమిదిమంది ఉన్నారు. దీంతో, మృతుల సంఖ్య 27కు చేరుకుంది. ఈ నెల 15న గోదావరిలో బోటు బోల్తా పడిన ప్రమాదంలో 47 మంది గల్లంతైన విషయం విదితమే. మిగిలినవారి కోసం రెస్క్యూ టీములు తీవ్రంగా గాలిస్తున్నాయి. లభ్యమైన మృతదేహాలను రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్చురీ విభాగానికి తరలించారు. గల్లంతైన వారి జాడ కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తున్న బంధువులు మృతదేహాలను చూసి తల్లడిల్లారు. రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదకర వాతావరణం నెలకొంది. విహారయాత్రకు వెళ్లిన వారు విగత జీవులుగా తిరిగి రావడాన్ని వారు తట్టుకోలేక బోరున విలపిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. గోదావరిలో గల్లంతైన బోటు లోకేషన్‌ను ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 320 అడుగుల లోతులో ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. జార్ఖండ్‌ నుంచి వచ్చిన నిపుణులు బోటు ఉన్న లోతువరకు ప్రత్యేక పరికరాలతో లోపలికి వెళ్లే ప్రయత్నాల్లో నిమగమయ్యారు. అధునాతన సైడ్‌ స్కాన్‌ సోనార్‌ పరికరంతో లోతైన ప్రాంతానికి వెళ్లి వెతుకుతున్నారు. బోటులోనే మిగిలిన వారి మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సైడ్‌ స్కాన్‌ సోనార్‌ సహాయంతో మంగళవారం రాత్రి కూడా గాలింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.