• Neti Charithra

14 మంది భారతీయ హజ్ యాత్రికుల కుటుంబాలకు భారీ పరిహారం!

#14 మంది భారతీయ హజ్ యాత్రికుల కుటుంబాలకు భారీ పరిహారం!

హైదరాబాదు: నేటి చరిత్ర (సెప్టెంబర్30) నాలుగేళ్ల క్రితం మక్కాలో జరిగిన క్రేన్‌ ప్రమాదంలో మరణించిన తెలుగు రాష్ట్రాల యాత్రికుల కుటుంబాలకు సౌదీ రాజు సల్మాన్‌ భారీగా నష్టపరిహారం చెల్లించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.1.88కోట్లు, గాయపడ్డవారికి రూ.93.77లక్షలు చెక్కులను నేరుగా బాధిత కుటుంబాలకు పంపారు. 2015లో జరిగిన ప్రమాదంలో భారత్‌కు చెందిన 13మంది ప్రాణాలు కోల్పోగా.. 14మంది గాయపడ్డారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన షమీ బాను, ఖాదర్బీ.. ఏపీ కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌, ఆయన భార్య ఫాతిమాబీ ఉన్నారు. గాయపడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన షేక్‌ ముజీబ్‌ ఉన్నారు. గాయపడిన 14మంది భారతీయులకు కూడా నష్టపరిహారాన్ని సౌదీ అరేబియా చెల్లించినట్లుగా కాన్సుల్‌ జనరల్‌ నూర్‌ రెహమాన్‌ షేక్‌ పేర్కొన్నారు. కాగా తోపుడు బండి మీద ప్లాస్టిక్‌ సామాన్లు అమ్ముకొని బతికే షేక్‌ ముజీబ్‌ తన ఇంటికి 93.77లక్షల చెక్కు రావడంతో ఆశ్చర్యపోయారు. వైద్యానికి కూడా డబ్బులు లేక అవస్థలు పడే తనకు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడిదని ఎవరైనా అడిగితే ఇబ్బందులెదురవుతాయని భయపడి.. నాంపల్లిలోని హజ్‌ హౌజ్‌కు వెళ్ళి విషయం చెప్పాడు. అక్కడి ప్రతినిధి.. ముజీబ్‌ను హోంమంత్రి మహమూద్‌ అలీ దగ్గరకు తీసుకెళ్లి ఆయన చేతుల మీదుగా చెక్కును ఇప్పించారు.