• Neti Charithra

12 యేళ్ళ తర్వాత విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..టీటీడీ లో కలకలం!

#12 యేళ్ళ తర్వాత విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..టీటీడీ లో కలకలం!

తిరుమల: నేటి చరిత్ర(నవంబర్26) సుమారు 12 సంవత్సరాల క్రితం తిరుమల లో జరిగిన డాలర్ ల స్వాహా కేసును ఏపీ ప్రభుత్వం తాజాగా విచారణ కు అదేశించటం.. టీటీడీ లో కలకలం.. రేపుతోంది. వివరాలలోకి వెళితే... తిరుమలకు వచ్చే భక్తులకు తితిదే ఆధ్వర్యంలో బంగారు, వెండి, ఇతర లోహాలతో శ్రీవారు, లక్ష్మీదేవీతో కూడిన డాలర్లను విక్రయిస్తుంటారు. దీనికి సంబంధించిన కౌంటర్‌ను 2006లో అసిస్టెంట్‌ షరాబు కె.వెంకటాచలపతి నిర్వహించేవారు. ఐదు గ్రాముల బరువైన 300 బంగారు డాలర్లు ఆ సమయంలో దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీనిపై అప్పట్లోనే ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న కౌంటర్‌ నిర్వాహకుడైన వెంకటాచలపతిని తితిదే 2006లో సస్పెండ్‌ చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళా ఉద్యోగిని చనిపోయారు. ప్రస్తుత ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవోలు ప్రభాకర్‌రెడ్డి, వాసుదేవ్‌లు కూడా విచారణ ఎదుర్కోగా.. వీరికి క్లీన్‌చిట్‌ లభించింది. మిగిలిన వారిలో కొందరు ఉద్యోగులు పదవి విరమణ చేయగా, కొందరు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఈ కేసులో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా అసిస్టెంట్‌ షరాబుతో పాటు 17 మందిపై విచారించాలంటూ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. పన్నెండెళ్ల నాటి కేసును తిరిగి తోడటంతో దేవస్థానం వర్గాల్లో కలకలం రేపుతోంది.