• Neti Charithra

విశాఖ పోలీస్ తీరు పై హైకోర్టు ఆగ్రహం !


విశాఖ పోలీస్ తీరు పై హైకోర్టు ఆగ్రహం !






అమరావతి: నేటి చరిత్ర (ఫిబ్రవరి28)


తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా గురువారం జరిగిన పరిణామాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ విమానాశ్రయం బయట వైకాపా కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇరు పక్షాల వాదనలను ఆలకించింది. సెక్షన్‌ 151 కింద చంద్రబాబుకు డీసీపీ స్థాయి అధికారితో నోటీసు ఇప్పించి ఆయన్ను ముందస్తు అరెస్ట్‌ చేశారని శ్రావణ్‌ కుమార్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. సెక్షన్‌ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ స్పందిస్తూ చంద్రబాబు భద్రత దృష్ట్యా నోటీసు ఇచ్చి ముందస్తుగా అరెస్ట్‌ చేశామని న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి నేరం చేయకుండా ఉండేందుకు, అతన్ని అదుపు చేసేందుకు 151 సెక్షన్‌ను ఉపయోగించాలని.. నోటీసు ఇచ్చిన ప్రకారం చూస్తే ఈ కేసు వ్యవహారం అలా లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు సెక్షన్‌ 151 కింద ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు నోటీసు ఎలా ఇచ్చారని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని డీజీపీతో పాటు విశాఖ పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది




32 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon