• Neti Charithra

ప్రభుత్వం.. తమ కుటుంబాలను ఆదుకోవాలని.. నిరసనలు చేస్తున్న ప్రయివేటు టీచర్లు..!


ప్రభుత్వం.. తమ కుటుంబాలను ఆదుకోవాలని.. నిరసనలు చేస్తున్న ప్రయివేటు టీచర్లు..!



కడప: నేటి చరిత్ర


ఇతర వర్గాలను అదు కుంటున్న ప్రభుత్వం

ఆరు నెలలుగా జీతాలు రాక అనేక అవస్థలు పడుతున్న ప్రైవేటు గురువులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ రాష్ట్ర పీటీఎల్‌యూ సంఘం ఆధ్వర్యంలో కడపజిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం వెంటనే

స్పందించాలని జిల్లావ్యాప్తంగా ఇంటి వద్దనే నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పీటీఎల్‌యూ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌, కరోనాను సాకుగా చూపిస్తూ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నాయన్నారు. మరికొన్ని ప్రైవేటు సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు, అడ్మిషన్ల పేరుతో పనిచేయించుకొని జీతాలు ఇవ్వడం లేదన్నారు. కొందరు జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. దీనిపై అధికారులకు, మంత్రులకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. జీతాలు లేక బతుకు భారంగా మారిందన్నారు. జీవనం కోసం జిల్లాలోని చాలా మంది ఉపాధ్యాయులు

కూరగాయలు అమ్ముకోవడంతో పాటు కూలి పనులు చేసుకోవడం సిగ్గుగా ఉందన్నారు. మరికొందరు ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రస్తుత పరిస్థితులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. 20, 30 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సమాజానికి ఎంతో సేవ చేసినా తాము ఈరోజు కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాజమాన్యాల నుంచి తమకు రావాల్సిన జీతాలను ఇప్పించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఏదో పథకంతో పేరుతో ప్రభుత్వం ఆదుకుంటోందని, మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి పీటీఎల్‌యూ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

సుమారు నాలుగు లక్షల కుటుంబాల జీవనం కష్టం గా మారిందని వారు వాపోతున్నారు.


163 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon