• Neti Charithra

చిన్నపాటి ..అజాగ్రత్త... ఆ.. కుటుంబాన్ని.. చిదిమేసింది!

#చిన్నపాటి ..అజాగ్రత్త... ఆ.. కుటుంబాన్ని.. చిదిమేసింది!

దుండిగల్‌: నేటి చరిత్ర (నవంబర్12) వంట గ్యాస్ లీక్ అవటంతో ఓ మధ్య తరగతి కుటుంబం కకలా.. వికలం అయ్యింది. ఇంట్లో సిలిండర్‌ లీకై సంభవించిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు దంపతులు ఒకరి తర్వాత ఒకరు గంటల వ్యవధిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వారి రెండు సంవత్సరాల పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయ విదారక సంఘటన తెలంగాణా లోని దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కొత్తగూడెం మధిరకు చెందిన షేక్‌ సుభాన్‌, షర్మిల దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి సూరారం హనుమాన్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి రెండు సంవత్సరాల పాప హైదర్‌ఫిర్దూష్‌ ఉంది. సుభాన్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 5న సాయంత్రం ఇంట్లో సిలిండర్‌ అయిపోవడంతో గ్యాస్‌స్టౌకు మరో కొత్త సిలిండర్‌ను అమర్చారు. అయితే ఆ సిలిండర్‌ లీకవుతున్న విషయాన్ని ఆ దంపతులు పసిగట్టలేకపోయారు. ఆ సాయంత్రం ఆదే గ్యాస్‌స్టౌపై భార్య వంటచేసింది. భోజనం అనంతరం వారు నిద్రించగా గది మొత్తం గ్యాస్‌ వ్యాపించింది. 6న ఉదయం 5.30 గంటల సమయంలో సుభాన్‌ నిద్రలేచి సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు స్విచ్‌ ఆన్‌ చేయగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే దంపతులతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 50 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు పెద్దాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం భర్త మృతి చెందిన కొన్ని గంటలకే భార్య సైతం మృతి చెందింది. పాప పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon