• Neti Charithra

కోవిడ్ లో కార్పొరేట్‌ దోపిడీ



  • విజిలెన్సు దాడులు జరుగుతున్నా 'డోన్ట్‌కేర్‌' అంటున్న ఆస్పత్రులు

  • ప్యాకేజీల రూపంలో నగదు వసూలుకు ప్రాధాన్యం

గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఇటీవల కరోనా వచ్చిన దేవేంద్రకుమార్‌ అనే యువకుడు ఓ ఆస్పత్రిలో చేరేందుకు వెళ్లగా రూ.5 లక్షల ప్యాకేజీ అవుతుందని చెప్పారు. దీంతో అతను మరో వైద్యుడు సలహాతో ఇంటి వద్ద ఉండి చికిత్స పొందగా రూ.5 వేల ఖర్చుతో కరోనా నుంచి కోలుకున్నట్టు చెప్పారు.

బాపట్లకు చెందిన తుమ్మా రమేష్‌ రెడ్డి గుంటూరులోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో రూ.10 లక్షలు ప్యాకేజీ మాట్లాడుకున్నారు. అతను రూ.4 లక్షలు చెల్లించారు. కానీ 4 రోజులకే మృతి చెందారు.

కరోనా చికిత్సకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు భిన్నంగా గుంటూరు జిల్లాలో కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వహాకులు భారీ వసూళ్లుకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏడు ఆస్పత్రులపై విజిలెన్సు అధికారులు తనిఖీలు చేసి పలు కేసులు నమోదు చేశారు. అయినా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ప్రభుత్వం నిర్ధేశించిన ఛార్జీలకు చికిత్సలు అందడం లేదు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ముందు ప్యాకేజీలను ఉంచుతున్నారు. కేవలం మంచం కేటాయిస్తే రూ.10 నుంచి 12,000 చెల్లించాలి. ఆక్సిజన్‌, మందులకు అదనంగా చెల్లించాలి. అలాగే రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లకు అప్పటి పరిస్థితుల బట్టి వేలల్లో వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఈ ఇంజక్షన్లు కేవలం ఆర్‌టిపిసిఆర్‌ ద్వారా పరీక్షలు చేయిం చుకున్న వారికే అందిస్తున్నారు. అయితే ప్రయివేటు ఆస్పత్రులకు ఎక్కువగా సిటీ స్కాన్‌ ద్వారా కరోనా నిర్ధారణ అయిన వారు వస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఇంజక్షన్లు కేటాయించకపోవడం వల్ల వీరు బయట నుంచి తెచ్చు కోవాలని పలు ఆస్పత్రుల వారు సూచిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఈ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నా తమ వద్ద లేవని వీటికి అదనంగా ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఒక్కొ ఇంజక్షనుకు రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఆక్సిజన్‌కు రూ.25 వేలు, మందులు, ఇతర ఖర్చులకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు నిర్ధారి స్తున్నారు. పిడుగురాళ్లలో ఇటీవల పల్నాడు ఆస్పత్రి, డాక్టర్‌ అంజిరెడ్డి ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కన్నా భారీగా అదనపు వసూళ్లు చేస్తున్నారని విజిలెన్సు అధికా రులు కేసులు నమోదు చేశారు. పిడుగురాళ్లలోని పలు ఆస్పత్రుల్లో ఇప్పటికీ రోజుకు రూ.25 వేలు, ఆక్సిజన్‌, మందులకు అదనంగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్య శ్రీ ఉన్నా అదనపు చెల్లింపులు తప్పడం లేదు.

తొలుత 60 శాతం అడ్వాన్సు, తరువాత రోజు వారి చెల్లింపులు ఉండాలని షరతు పెడుతున్నారు. గుంటూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు రూ.15లక్షల ప్యాకేజీ నిర్ధారించారు. సంబంధిత రోగి చనిపోతే మొత్తం సొమ్ము తిరిగి చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు. అయితే పలు ఆస్పత్రుల వారు కేవలం నగదు చెల్లిస్తేనే చికిత్సలు చేస్తున్నారు. ఆస్పత్రుల ఖాతాలకు ఫోన్‌ పే, గుగుల్‌ పే, మనీ ట్రాన్స్‌ఫర్‌కు అంగీకరించడం లేదు. కొంత మంది మాత్రం వారి వద్ద పనిచేసే ఉద్యోగుల ఖాతాల్లోకి మనీ ట్రాన్స్‌ఫర్‌కు అంగీకరిస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో భారీగా ప్యాకేజీలు అమలు చేస్తుండటంతో వీటిని భరించలేని ప్రజలు ప్రభుత్వ వైద్య శాలల బాట పడుతున్నారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులపై వత్తిడి పెరిగి పడకలు నిండిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీ ఆగడం లేదు.