• Neti Charithra

కరోనా సునామి !

దేశంలో కరోనా సునామీలా విరుచుకుపడతోంది. వరుసగా నాలుగవ రోజూ కేసుల సంఖ్య 3 లక్షల మార్కును దాటాయి. ఆదివారం ఉదయానికి 3,49,691 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. 2,767 మంది మరణించారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద, కరోనా నిర్దారణ పరీక్షల వద్ద, ఆసుపత్రుల వద్ద చివరకు శ్మశానాల వద్ద కూడా క్యూలు తప్పని స్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. ఈ దుస్థితికి కారణం ఏమిటి ?

1. 'వ్యాక్సిన్‌'కు సాయంలో జాప్యం

కరోనా నివారణకు వ్యాక్సిన్‌ అత్యంత కీలకమన్న విషయం అందరికి తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచడానికి, త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి మోడీ సర్కారు తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. యుఎస్‌, యుకెలు వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్తలకు అడ్వాన్స్‌ పెట్టుబడులు సమకూర్చాయి. మనదేశంలో కోవిషీల్డ్‌ ఉత్పత్తి చేస్తున్న సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కుగానీ, కోవాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న భారత్‌ బయోటెక్‌కు గానీ ఇటువంటి సహకారం ప్రభుత్వం నుండి లభించలేదు.

ఆగస్టు 2020 నాటికే అమెరికా ప్రభుత్వం 44,700 కోట్ల రూపాయలను వివిధ వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు పెట్టుబడి సాయంగా ఇచ్చింది. అప్పటికి ఆ సంస్థలు పరిశోధనల్లోనే ఉన్నాయి. మన దేశంలో మోడీ సర్కారు 2021 ఏప్రిల్‌ 19వ తేది (వారం రోజుల క్రితం) వరకు ఆ దిశలో నిర్ణయం తీసుకోలేదు అప్పుడు కూడా 4,500 రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

2. ఆలస్యంగా దిగుమతులు మన వ్యాక్సిన్‌ సంస్థల ఉత్పత్తి సామర్ధ్యం తక్కువన్న సంగతి కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. ప్రస్తుతం ఇస్తున్న పద్దతుల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నా నెలకు 150 నుండి 200 మిలియన్‌ డోసులు అవస రమౌతాయి. అయితే, దీనిలో సగం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. వివిధ దేశాల్లో ఉత్పత్తి చేస్తున్న ఇతర సంస్థల నుండి అవపరమైన వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవాల్సిఉండగా 2021 జనవరి వరకు ఆ దిశలో చర్యలో తీసుకోలేదు. అప్పుడు కూడా 16 మిలియన్‌ డోసులకు మాత్రమే ఆర్డర్‌ పెట్టింది. పీకల మీదకు వచ్చిన తరువాత ఇప్పుడు కొన్ని విదేశీ సంస్థలనుండి దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ సంస్థలు వెంటనే సరఫరా చేసే స్థితిలో లేవు. ఆగస్టు 2020 నాటికే అమెరికా 400 మిలియన్‌ డోసులను, యూరోపియన్‌ యూనియన్‌ నవంబర్‌ 2020నే 800 మిలియన్‌ డోసులను బుక్‌ చేసుకున్నాయి.

3. టెండర్లు పిలిచినా ... అక్టోబర్‌ 2020లోనే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 152 జిల్లా ఆసుపత్రుల్లో 162 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించింది. అంతే కాదు. వీటికి టెండర్లు కూడా పిలిచింది. వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా కేవలం 201 కోట్ల రూపాయలు మాత్రమే. వీటిలో 33 మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయయి. మరి పూర్తికాని చోట ఆక్సిజన్‌కొరత లేదా? ఉంది. రోగులు చనిపోవడం లేదా ? చనిపోతున్నారు! ఈ మరణాలకు కారణం ఎవరు ?

4. పరి'శోధన' ఏదీ ?

బి.1.167 రకం కరోనా వైరస్‌ గురించి విన్నారా! ఇది మనదేశంలోనే పుట్టింది. కరోనా వైరస్‌కు మన దేశంలో వచ్చిన కొత్త మ్యూటేషన్‌గా చెప్పవచ్చు. దేశంలో అత్యదికంగా చోటుచేసుకుంటున్న మరణాలకు ఈ మ్యూటేషనే కారణమని చెబుతున్నారు. అక్టోబర్‌52020న దీనిని దేశంలో తొలిసారి కనుగొన్నా డిసెంబర్‌ వరకు పరిశోధనలు ప్రారంభించలేదు. . జనవరిలో పది ల్యాబ్‌ల నెట్‌వర్క్‌తో ఏర్పాటైన జెనామిక్‌ కన్సార్టియమ్‌ దీనిపై పరిశోధన ప్రారంభించింది. ఈ పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం 115 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఇప్పటి వరకు విడుదలైంది 80 కోట్ల రూపాయలే. అది కూడా 2021 మార్చి 31న! బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు కేంద్రం నిధులు విడుదల చేయకపోవడమే దీనికి కారణం.

5. కుంభమేళాకు అనుమతి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకచోట చేరితే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నది అందరికి తెలిసిందే. కానీ,రోజూ లక్షలాది మంది చేరడానికి అవకాశముండే కుంభమేళాకు కేంద్రం అనుమతిచ్చింది. పెద్ద ఎత్తున వైరస్‌ వ్యాప్తితో పాటు, విమర్శలు వెల్లువెత్తడంతో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిది. వివిద రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారీ ర్యాలీలకు అనుమతులు ఇవ్వడం, సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ తరహా ర్యాలీలు, సభల్లో పాల్గొనడం కూడా ఇటువంటిదే.

45 ఏళ్లు పైబడిన వారికే ఉచిత టీకా

  • మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : 45 ఏళ్లు పైబడిన వారికి ఉచిత టీకా కార్యక్రమం కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కరోనా మహమ్మారి సునామీలా మారుతుం డడం, 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వారికి టీకాలు వేసే బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వ చర్యపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని 76వ విడత 'మన్‌కీ బాత్‌'లో మాట్లాడుతూ, పై విధంగా అన్నారు. టీకాల గురించి ఎటువంటి వదంతులను నమ్మొద్దని అన్నారు. కరోనా రెండో దశ మన సహనాన్ని పరీక్షిస్తోందని అన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిమగమై ఉందన్నారు.కరోనాపై పోరులో వైద్యులు, వైద్య సిబ్బంది అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సింగ్‌ సిబ్బంది, అంబులెన్స్‌ డ్రైవర్లతో మోడీ మాట్లాడారు.