• Neti Charithra

ఏపీ లో హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించాలి- రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు డిమాండ్..!


ఏపీ లో హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించాలి- రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు డిమాండ్..!తిరుపతి: నేటి చరిత్ర


రాష్ట్రంలో తక్షణం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి బైరాగి పట్టెడ లోని సిపిఐ కార్యాలయంలో గురువారం

సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాధ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కోవిడ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, క్వారంటైన్ కేంద్రాలలో పౌష్టికాహారం ఇవ్వాలని, మద్యం దుకాణాలు, దేవాలయాలు తక్షణం మూసివేయాలని నేతలు డిమాండ్ చేశారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంతోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ముందుగానే కట్టడి చేయకపోవడం, విదేశాల నుండి ప్రతినిధులను ఆహ్వానించి సభలు సమావేశాలు పెట్టడంతో దేశంలో పాజిటివ్ కేసులు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఉపశమనం కల్పించకపోగా, నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమలను ఆదుకో లేదన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైద్యానికి అనుమతి ఇచ్చి ప్రజల నుండి దోచుకోమని లైసెన్స్ ఇచ్చినట్లు అయిందని విమర్శించారు. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వైద్యం అందించాలని కోరారు. ఇతర జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం ఆసుపత్రులకు వస్తున్న వారికి తక్షణం వైద్యం చేయాలని డిమాండ్ చేశారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడానికి ప్రభుత్వ వైఖరి ప్రధాన కారణమని అన్నారు. లాక్ డౌన్ కొనసాగుతుండగానే రాష్ట్రంలో బ్రాందీ షాపులు ఉదయం ఏడు గంటలకి తెరవడం మద్యం కొనేందుకు జనం విపరీతంగా ఎగబడ్డారు అని అన్నారు. దేవాలయాల ఆదాయం పెంచుకోవడానికి రాష్ట్రంలో దేవాలయాలను తెరిచారని దీంతో కరోనా పెరిగేందుకు కారణం అయింది అన్నారు. టీటీడీలో అర్చకులు నలుగురు చనిపోగా, 700 మంది ఉద్యోగులకు పైగా కరోనా పాజిటివ్ రావడం జరిగిందన్నారు. కరోనా ను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. దీనిని కట్టడి చేయాలని రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ తుడ చైర్మన్ జి. నరసింహ యాదవ్ మాట్లాడుతూ తిరుమల దేవస్థానం దర్శనాలు నిలుపుదల చేయకపోవడంతో తిరుపతి లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అన్నారు. అదేవిధంగా కరోనా వివరాలు ప్రభుత్వం సక్రమంగా వెల్లడించడం లేదని అన్నారు. శాంపుల్ ఇచ్చిన పది రోజుల అనంతరం ఫలితాలను వెల్లడించడం దురదృష్టకరమన్నారు. మెడికల్ కిట్లు సరిపడినంత అందించడంలో ప్రభుత్వం విఫలం అయింది అని అన్నారు.


రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ కరోనా రోగులకు రోజుకు ఒక వ్యక్తికి 500 రూపాయలు ఖర్చు చేసి పౌష్టిక ఆహారం అందించాల్సి ఉందన్నారు. అయితే ఐసోలేషన్, కోరం టైన్ కేంద్రాలలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు అన్నారు. కరోనా మహమ్మారికి ఎందరో కవులు, కళాకారులు, అభ్యుదయ కాముకులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆసుపత్రులను రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కరోనా మరణాలు అన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్నవే అని అన్నారు. జిల్లాలో ఉన్న కేసులలో 50 శాతం తిరుపతి నగరంలోనే నమోదవుతున్నాయని దేనికి జిల్లా అధికారులు, టీటీడీ దే ప్రధాన బాధ్యత అని అన్నారు.


ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.జనార్ధన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, కార్యదర్శులు రాధాకృష్ణ, రాజా, ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శివ, మహిళ సమాఖ్య నగర అధ్యక్ష కార్యదర్శులు మంజుల, రత్నమ్మ, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు విజయ్, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి రామకృష్ణ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శ్రీ రాములు, సిపిఐ శాఖా కార్యదర్శులు బాబు, బాల, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


116 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon