- Neti Charithra
ఆర్టీసీ.. డిపో మేనేజర్ అంటూ.. చోరీ చేశాడు!

#ఆర్టీసీ.. డిపో మేనేజర్ అంటూ.. చోరీ చేశాడు!
తిరుపతి: నేటి చరిత్ర(అక్టోబర్8) ఆర్టీసీ డీఎంనంటూ ఓ వ్యక్తి తిరుపతి ఆర్టీసీ కౌంటర్లోని నగదు దోచుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతనెల 26న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని ఏటీఎం కార్యాలయానికి పక్కనే ఉన్న తెలంగాణ ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్‌కు నల్లచొక్కా, జీన్స్ ప్యాంటు వేసుకుని క్లాసుగా ఓ వ్యక్తి వచ్చాడు. తాను తెలంగాణలోని బండ్లగూడ ఆర్టీసీ డీఎంనని చెప్పుకొన్నాడు. తెలంగాణలోని ఓ డీఎం ద్వారా ఇక్కడకు ఫోన్ చేయించాడు. తనకు హైదరాబాద్‌కు రెండు టిక్కెట్లు కావాలని కోరి.. తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ అతన్ని బస్టాండ్‌కు దగ్గరలోని ఓ హోటల్‌కు తీసుకువెళ్లి టిఫిన్ పెట్టించి.. తిరిగి బస్టాండ్‌కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 30వ తేదీన ఉదయం 11 గంటలకు తిరిగి అదే కౌంటర్‌కు వచ్చాడు. కౌంటర్‌ను లీజుకు తీసుకున్న ప్రవీణ్‌కుమార్ బండ్లగూడ డీఎం అని చెప్పుకున్న ఆ వ్యక్తికి మర్యాదలు చేశారు. తనకు టిఫిన్ కావాలని ఆ వ్యక్తి కోరగా కౌంటర్లోని ప్రవీణ్‌కుమార్ హోటల్‌కు వెళ్లి 10 నిమిషాల్లో తీసుకువచ్చాడు. అప్పటికే కౌంటర్లో ఉన్న రూ.71,900 తీసుకుని డీఎంగా చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఉడాయించాడు. గతంలో గోపాలపట్నంలో ఆర్టీసీ డీఎంనంటూ రూ.2.20 లక్షల మోసానికి పాల్పడిన వ్యక్తి ఇతను ఒక్కడేనని తెలంగాణ నుంచి వచ్చిన పలువురు ఆర్టీసీ అధికారుల ద్వారా గుర్తించారు. హోటల్లో టిఫిన్ చేసిన సందర్భంగా సీసీ కెమెరాలో చిక్కిన వ్యక్తి ఫొటోలు తీసుకుని తూర్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
