• Neti Charithra

ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చుకుంటేనే చికిత్స..


  • వరంగల్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రుల తీరు

  • చికిత్స పొందుతున్న రోగులనూ పంపేస్తున్న వైనం

  • ఎంజీఎంలో అవసరానికి సరిపడా లేని నిల్వలు

  • బ్లాక్‌ మార్కెట్‌లో రూ.2 వేలకు సిలిండర్ల విక్రయం

హన్మకొండ అర్బన్‌, ఏప్రిల్‌ 21: వరంగల్‌లోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ దొరక్క కరోనా రోగులు విలవిల్లాడుతున్నారు. కరోనాతో పోరు కంటే ఆక్సిజన్‌ లేక రోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల హడావుడిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. వైద్యాధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గత మూడు రోజులుగా వరంగల్‌లోని ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్‌ సరఫరా కావడం లేదు. ఇదే అవకాశంగా తీసుకొని కొందరు ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.600కు దొరకాల్సిన బల్క్‌ సిలిండర్‌ను రూ.2000కు విక్రయిస్తున్నారు. ఇప్పుడు అది కూడా దొరకడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు కరోనా రోగులను పంపించి వేస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ను తెచ్చుకుంటేనే చికిత్స చేస్తామని తెగేసి చెబుతున్నారు.

వరంగల్‌లో ఎంజీఎంతో పాటు 50 ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాయి. కరోనా రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ఆక్సిజన్‌ వాడకం కూడా గతంలో కన్నా వంద రెట్లు పెరిగింది. ఇదివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోజుకు 500 సిలిండర్లు సరిపోయేవి. ఇప్పుడు వెయ్యి సిలిండర్లయినా చాలడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు ఐదువేల సిలిండర్లు అందుబాటులో ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వరంగల్‌లో మూడు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటికి సాధారణంగా హైదరాబాద్‌, బల్లార్ష, బెంగుళూరు నుంచి ముడిసరుకు వస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా సరుకు రాకపోవడంతో ఆక్సిజన్‌ ఉత్పత్తి ఆగిపోయింది. ఎంజీఎం ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డులో ప్రస్తుతం 250 మంది కరోనా రోగులు ఉన్నారు. వారికి రోజుకు 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోంది. కానీ అంత అందుబాటులో ఉండడం లేదు. దీనితో రోగులు ఆక్సిజన్‌ కొరతతో విలవిలలాడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా అక్కడా ఇదే పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చే రోగులను కొన్ని ఆస్పత్రులు ఆక్సిజన్‌ కొరత వల్ల చేర్చుకోవడం లేదు. రోగుల బంధువులు బ్లాక్‌ మార్కెట్‌లో రూ.ఐదు వేలకైనా ఆక్సిజన్‌ సిలిండర్లను కొనడానికి సిద్ధంగా ఉన్నా దొరకడం లేదు.