• Neti Charithra

అయోధ్య స్థలం హిందువుల కె- తీర్పు వెల్లడి

#అయోధ్య స్థలం హిందువుల కె- తీర్పు వెల్లడి

ఢిల్లీ : నేటి చరిత్ర (నవంబర్9) అయోధ్య పై సుప్రీం కోర్టు శనివారం తుది తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తీర్పును చదివి వినిపించారు. అయిదుగురు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి ఈ తీర్పును వెలువరించారు. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదని సుప్రీం పేర్కొంది. బాబ్రీ మసీదు కింద భారీ నిర్మాణం ఉందని తెలిపింది. పురావస్తు శాఖ నివేదికను ఊహాజనితమని కొట్టిపారేయలేమంటూ.. షియా బోర్డు పిటిషన్‌ ను కొట్టివేసింది. వివాదాస్పద భూమి తమదేనంటూ.. దాఖలైన పిటిషన్‌ ను కొట్టివేసింది. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలు పరిగణనలోకి లోబడి తీర్పు వెలువరించినట్లు తెలిపింది. బాబ్రీ మసీదును ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ప్రాతిపదిక లేదని, మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదని సుప్రీం స్పష్టం చేసింది. నిర్మోహీ అఖాడా పిటిషన్‌ ను కూడా కొట్టేసింది. నిర్మొహి పిటిషన్‌ కు కాలం చెల్లిందని చెప్పింది. పురావస్తు శాఖ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదును కట్టలేదని, పురావస్తు పరిశోధనలను చూస్తే 12 వ శతాబ్ధంలోనే ప్రార్థనా స్థలం ఉందని అయితే అది దేవాలయం అని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంది. దేవాలయాన్ని ధ్వంసం చేశారనడానికి పురావస్తు ఆధారాల్లేవు అని సుప్రీం స్పష్టం చేసింది. 12 - 16 శతాబ్ధాల మధ్య అక్కడేముందో చెప్పడానికి పురావస్తు ఆధారాల్లేవని తెలిపింది. రాముడు అయోధ్యలోనే జన్మించారని హిందువుల విశ్వాసమని, అయోధ్యను హిందువులు రామ జన్మభూమిగా భావిస్తారని తెలిపింది. ఈ భావనలో ఎలాంటి వివాదానికి తావు లేదని చెప్పింది. హిందువుల నమ్మకం నిజమైనది కాదనడానికి ఆధారాల్లేవని, ఈ నమ్మకానికి విలువ ఉందా లేదా అని తేల్చడం కోర్టు పరిధిలో లేదని సుప్రీం తెలిపింది. నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులను నిర్ణయించలేమని, న్యాయ సూత్రాల ఆధారంగానే భూ యాజమాన్యాన్ని నిర్ణయించాలని సుప్రీం తెలిపింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి అయిదెకరాల స్థలం కేటాయిస్తూ.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.