• Neti Charithra

అయోధ్య వివాదం.. నాడు- నేడు( 1528- 2019) సం క్లుప్తం !

#అయోధ్య వివాదం.. నాడు- నేడు( 1528- 2019) సం క్లుప్తం !

ఢిల్లీ: నేటి చరిత్ర (నవంబర్9) అయోధ్యలోని వివాదాస్పద కేసులో సుప్రీం కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పులో వివాదాస్పద స్ధలం హిందూ పక్షానికి అప్పగిస్తూ, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్ధలం ఇవ్వాలని, ఐదెకరాల స్థలం సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అయోధ్య వివాద క్రమం ఎలా ప్రారంభం అయిందంటే... 1528 : మొదటి మొగల్‌ చక్రవర్తి బాబర్‌ ఇక్కడ బాబ్రీమసీదును నిర్మించినట్లు భావిస్తున్నారు. 1885: బాబ్రీ మసీదు సమీపంలో ఆలయ నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతూ మహంత్ ర‌ఘ్‌బీర్‌ దాస్‌ ఫైజాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. డిసెంబరు 22-23, 1949 : మసీదు లోపల రాముడి విగ్రహాలు బయటపడ్డాయి. 1950 : ఆ విగ్రహాలకు పూజాదికాలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ రామ్‌ గోపాల్‌ విశారద్‌, రామచంద్ర దాస్‌ ఫైజాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. 1959 : వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ నిర్మోహి అఖారా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 1961: వివాదాస్పద భూమికి టైటిల్‌ ప్రకటించాలని కోరుతూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు కోర్టును ఆశ్రయించింది. 1986 ఫిబ్రవరి : విగ్రహాలకు పూజాదికాలు నిర్వహించేందుకు ఫైజాబాద్‌ కోర్టు హిందువులకు అనుమతించింది. 1989 ఆగస్టు : టైటిల్‌ వివాదంపై అలహాబాద్‌ హై కోర్టు విచారణ జరిపి యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 1989 నవంబరు : వివాదాస్పద భూమి సమీపంలో పూజాదికాలు నిర్వహించేందుకు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి)కు అనుమతించింది. 1990 సెప్టెంబరు : బిజెపి నేత ఎల్‌ కె అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. 1992 డిసెంబరు: కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు జస్టిస్‌ లిబర్హన్‌ కమిటీ ఏర్పడింది. 1993 : వివాదాస్పద స్థలానికి పక్కనే ఉన్న 67 ఎకరాల భూమిని పి వి నరసింహారావు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. డాక్టర్‌ ఇస్మాయిల్‌ ఫరూకి కేసులో అప్పటి ప్రభుత్వం 67 ఎకరాల భూమిని సేకరించడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. 2002, ఏప్రిల్‌ : టైటిల్‌ దావాలపై అలహాబాద్‌ హై కోర్టు విచారణ ప్రారంభించింది. 2003, మార్చి : మహ్మద్‌ అస్లామ్‌ ాభూరే కేసులో సేకరించిన స్థలంలో మత కార్యకలాపాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. 2009 : లిబర్హన్‌ కమిటి తన విచారణ నివేదికను సమర్పించింది. 2010, సెప్టెంబరు 30 : వివాదాస్పద స్థలాన్ని హిందువులకు, ముస్లింలకు, నిర్మోహి అఖారాకు సమానంగా పంచాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. 2011 మే : ఆయా పక్షాలు దాఖలు చేసిన పిటిషన్లకు స్పందించిన సుప్రీం కోర్టు హై కోర్టు తీర్పుపై స్టే విధించింది. 2017 ఆగస్టు : అనంతరం దాఖలైన పలు అప్పీళ్ళపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. దీంతో టైటిల్‌ వివాదం పక్కదోవ పట్టింది. మసీదులలో పూజాదికాలు ఇస్లాంలో అంతర్భాగం కాదని సుప్రీం కోర్టు ఫరూకి కేసులో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపాలని ముస్లిం పక్షాలు కోరాయి. ప్రార్థనలను నిరాకరిస్తూ మెజార్టీ తీర్పు వెలువడింది. 2019 జనవరి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణను పునరుద్ధరించింది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని తొలుత సూచించింది. 2019 ఆగస్టు 6 : సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ ఎం.ఐ. కలిఫుల్లా నేతృత్వంలో మధ్యవర్తిత్వ కమిటీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైంది. దీంతో సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. 2019, అక్టోబరు 16 : సుప్రీం కోర్టు 40 రోజులపాటు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. 2019 నవంబరు 9 : సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరిస్తూ వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతిచ్చింది. అయోధ్యలోనే మరో చోట ముస్లింలకు ఐదెకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.