• Neti Charithra

అనంతపురం లో ఘోరం.. రైలు కింద పడి తల్లి తో పాటు ముగ్గురు ఆత్మహత్య!

#అనంతపురం లో ఘోరం.. రైలు కింద పడి తల్లి తో పాటు ముగ్గురు ఆత్మహత్య!

అనంతపురం: నేటి చరిత్ర(డిసెంబర్1) అనంతపురం జిల్లా లో ఒకేకుటుంబాని చెందిన ముగ్గురు రైలు కింద పడి మృతి చెందిన ఘటన కల కలం రేపింది. అనంతపురం లోని జాతీయ ఉద్యానవనం సమీపంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో పట్టణ సీఐ రెడ్డప్ప కథనం మేరకు.. ప్రాంతానికి చెందిన వెంకటేశు, పోలేరమ్మ(45) భార్యాభర్తలు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆర్తి(17), దీప(11) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఆర్తి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, నర్సింగ్‌లో శిక్షణ పొందుతోంది. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా పోలేరమ్మ తన ఆభరణాలను తాకట్టు పెట్టింది. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. ఈక్రమంలో శనివారం రాత్రి 9గంటల సమయంలో పోలేరమ్మ భర్తతో గొడవ పడి కుమార్తెలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వారి కోసం గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తెల్లవారుజామున రైలు పట్టాలపై వారు విగతజీవులుగా కనిపించారు. రైలు పట్టాలపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.