- Neti Charithra
అదుపు తప్పి.. నది లోపడ్డ.. బస్సు.. 24 మంది మృతి.. 16 మంది కోసం.. గాలింపు !

జైపూర్ : నేటి చరిత్ర (ఫిబ్రవరి26)
రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం బుండికోట లాల్సోట్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మఅతదేహాలను బయటకు వెలికితీస్తున్నారు. ఘటనాస్థలి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసుల సమాచారం మేరకు... బూండీలోని కోటకు చెందిన వరుని కుటుంబ సభ్యులు 40 మంది ఒకే బస్సులో సవారుమాదోపూర్లో జరగనున్న పెళ్లి మండపానికి బయలుదేరారు. అతివేగంగా వస్తున్న బస్సు వంతెన వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ ప్రమాదాన్ని గ్రహించేలోపే నదిలోకి బస్సు దూసుకుపోవడంతో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 24 మంది చనిపోయినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు
